Breaking News

RRR యాక్షన్ - మాటల్లేవ్..!


టాలీవుడ్ లో గ్రాండియర్ అనే పదానికి కొత్త అర్థం చెప్పిన రాజమౌళి తాజా మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ అనౌన్స్ మెంట్ నుంచే సంచలనాలకు వేదికగా మారుతోంది. మొదటి రోజు చరణ్ తారక్ తో కలిసున్న స్టిల్ ని తాను ఫస్ట్ షాట్ యాక్షన్ చెప్పిన వీడియో ను షేర్ చేసుకున్నాక సైలెంట్ అయిపోయిన జక్కన్న గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ శివార్లలో వేసిన ప్రత్యేక సెట్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఇందుకుగాను 18 పైగా ఇండస్ట్రియల్ క్రేన్లతో పాటు 65పైగా రోప్ వ్యవస్థలను ఏర్పాటు చేసారు. అంతే కాదు ఈ మొత్తం సీక్వెన్స్ 20 స్టంట్ మాస్టర్ల ఆధ్వర్యంలో జరుగుతోంది.

వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదూ. ఏదో చిన్నా చితకా మసాలా ఫైట్ అయితే ఇంత బిల్డప్ అవసరం లేదు. అలా చేస్తే రాజమౌళి అని ఎందుకు అంటాం. ఊహకందని విధంగా ఇద్దరు కలిసి పాల్గొన్న ఈ ఫైట్ సినిమా చాలా కీలకమైనదని ఇన్ సైడ్ టాక్. లీకుల విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తగా ఉన్నాడు. యూనిట్ సభ్యులు పెద్ద మొత్తంలో ఉండటంతో మొబైల్ ఫోన్స్ కట్టడి చేసినా వాళ్ళు బయటికి వచ్చాక ఏదో ఒక రూపంలో లోపల జరుగుతున్న విషయాలు కొన్ని తెలుస్తున్నాయి. అందులో భాగంగా వచ్చిందే ఈ న్యూస్ కూడా. ఇది విన్న ఫ్యాన్స్ ఊహలకు హద్దులు ఉండటం లేదు.



ఇలాంటి ఫైట్ ఒకరి మీద చిత్రీకరిస్తేనే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అలాంటిది చరణ్ తారక్ లు కలిసి చేసారు అంటే ఇక చెప్పేదేముంది. హీరొయిన్లు ఎవరు అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. విలన్ల పేరు కూడా ప్రస్తుతానికి రహస్యంగా ఉంచారు. 2020 దాకా ఇలాంటి సస్పెన్స్ లు ఎన్నో భరించక తప్పదు ఇద్దరు హీరోల అభిమానులు. రాజమౌళి అంతే. ఎంత ఊరిస్తాడో అంత గొప్ప సినిమా ఇస్తాడు. దీని మీద కూడా అదే నమ్మకం వ్యక్తమవుతోంది.