Breaking News

సావిత్రిగా ఈమె ఇంకా.?

సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అనగానే చాలామందికి రకరకాల సందేహాలు కలిగాయి. కానీ ఆ పాత్రను ఆమె అద్భతంగా పోషించి మెప్పించింది. సావిత్రిగా ఇంకెవరూ ఇంత బాగా చేసి ఉండరేమో అన్నంతగా నటించి మెప్పించింది కీర్తి. నటనతో పాటు లుక్ కూడా అంత బాగా కుదిరింది కీర్తికి. ఐతే సావిత్రి పాత్ర కోసం ముందుగా నిత్యా మీనన్‌ను అనుకున్నట్లుగా వార్తలొచ్చాయి.
ఇది నిజమే అంటూ.. కొన్ని కారణాల వల్ల ఈ పాత్రను తాను చేయలేకపోయానని చెప్పింది నిత్య. మరి నిత్య సావిత్రి పాత్రలో నటించి ఉంటే ఎలా ఉండేది.. ‘మహానటి’ సినిమా అప్పుడు ఎలాంటి అనుభూతిని కలిగించి ఉండేదే.. ఇంతే బాగా ఆ పాత్ర పండేదా.. సినిమా ఇంత హిట్టయ్యేదా అని ఆలోచించేవారికి ఈ రోజు సమాధానాలు లభించాయి.
సావిత్రిగా నిత్య ఎలా ఉండేదో ఈ రోజు ప్రేక్షకులకు ఒక అవగాహన వచ్చింది. ‘యన్.టి.ఆర్’ సినిమాలో సావిత్రిగా నిత్యనే నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘గుండమ్మ కథ’లోని ఓ సన్నివేశంలో నిత్య సావిత్రిగా, బాలయ్య ఎన్టీఆర్‌గా కనిపిస్తున్న లుక్‌ను దీపావళి కానుకగా రిలీజ్ చేశారు. ఇందులో నిత్యను చూస్తే నిజంగా సావిత్రిని చూస్తున్నట్లే ఉంది. ఆమె అవతారం పక్కగాగా సావిత్రిని తలపిస్తోంది. కీర్తితో పోలిక కాదు కానీ.. ‘మహానటి’ నిత్య నటించి ఉంటే మాత్రం ప్రేక్షకుల ఫీలింగ్ ఎంతమాత్రం మారేది కాదన్నది స్పష్టం.
నిత్య నటన గురించి చెప్పాల్సిన పని లేదు కాబట్టి.. ఆమె ఆ పాత్రను అద్భుతంగా పండించి ఉండేదే. ఆమె ఈ సినిమా చేసి ఉంటే కెరీర్లో ఒక మైలురాయిలాగా నిలిచిపోయేదే. అప్పుడు ఏ కారణంతో ఆమె నో చెప్పిందో కానీ.. ఈ సినిమా సాధించిన విజయాన్ని చూసి కచ్చితంగా వద్దన్నందుకు బాధ పడి ఉంటుందేమో.